Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు రూ.301 కోట్లు కాగా...మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు డీబీటీ పద్ధతిలో అందించగా...అందులో 97 శాతం మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమ అయిందని అధికారులు వివరించారు. అయితే 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అవ్వలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేయాలని...ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులను సిఎం ఆదేశించారు. అర్హులెవరికీ సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంత మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని...వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుండి సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపికై ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లలో పడలేదో...వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోరుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే శుక్రవారం నాటికి సాంకేతిక సమస్యలు అన్నీ పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Admin
Studio18 News