Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Ram Temple Chariot Catches Fire: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. అప్పటికే రాములోరి రథం సగానికిపైగా కాలిపోయింది. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కల్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఘటన స్థలంకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, రథం కాలిపోయిన ప్రాంతంలో దుండగులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నేరస్తులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హనకనహల్ లో అర్ధరాత్రి ఆలయ రథం దగ్దం ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Admin
Studio18 News