Studio18 News - ANDHRA PRADESH / : Eluru district: పెళ్లికాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు లక్షల నగదు, బ్యాంకు పుస్తకాలు, కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మ్యాట్రిమోని డాట్.కామ్ లోని వివరాలను సేకరించి వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులను ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ముఠా మోసాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మండలం బంగారు పేటకు చెందిన పాశం అనిల్ ఇస్రోలో ఉద్యోగం అని, ఆస్తులు, బంగ్లాలు, విల్లాలు ఉన్నాయని మోసం చేసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. అనిల్ నాలుగు పెళ్లిళ్లు చేసుకొని మోసాలకు పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ కు సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. ముఠాలోని మరికొంత మంది సభ్యులను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. పెళ్లిళ్లు విషయంలో ఎటువంటి విచారణ జరపకుండా మోసపోవద్దని, పెళ్లిళ్ల విషయంలో అవసరమైతే పోలీసు వెరిఫికేషన్ కూడా చేయించుకోండని ప్రజలకు ఎస్పీ సూచించారు.
Admin
Studio18 News