Studio18 News - ANDHRA PRADESH / : దివంగత నేత పరిటాల హత్య కేసులో దోషులు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. కేసులో నిందితులుగా ఉన్న నారాయణరెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), రంగనాయకులు (ఏ5), వడ్డే కొండ (ఏ6), ఓబిరెడ్డి (ఏ8)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వీరు రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. వీరిలో నలుగురు కడప సెంట్రల్ జైలు, మరొకరు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వీరంతా 18 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. 2005 జనవరి 24న పరిటాల రవిని అనంతపురంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో దారుణంగా హతమార్చారు. మొద్దు శీను, రేఖమయ్య, నారాయణరెడ్డి కాల్పులు జరపగా... ఓబిరెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ తదితరులు టీడీపీ కార్యాలయం బయట బాంబులు వేసి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. కాల్పుల్లో రవితో పాటు ఆయన గన్ మన్, ధర్మవరంకు చెందిన ఆయన అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చగా... నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన 12 మందిలో రామ్మోహన్ రెడ్డి అప్రూవర్ గా మారాడు. ఏ1 మొద్దు శీను, ఏ2 మద్దెలచెరువు సూరితో పాటు తగరకుంట కొండారెడ్డి విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు. మర్డర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే సీబీఐ దర్యాప్తులో వీరిద్దరూ నిర్దోషులుగా తేలారు.
Also Read : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా ఇకలేరు
Admin
Studio18 News