Studio18 News - ANDHRA PRADESH / : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని జనసేనాని అన్నారు. దాతృత్వంతో పాటు దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పవన్ ప్రశంసించారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలియజేస్తూ పోస్టు పెట్టారు. "ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా గారి మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన భారత పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆదర్శంగా నిలిచారు. రతన్ టాటా నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు. కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను" అని జనసేనాని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Admin
Studio18 News