Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు విరామం కావడంతో ఎమ్మెల్యేలకు బడ్జెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పార్లమెంట్ రీసెర్చ్ సర్వీస్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలోని అనుభవాలను ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడం, విలువలకు కట్టుబడి ఉండడం, ప్రజా ఉపయోగ రాజకీయాలు చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని అభిలషించారు. ప్రజా సమస్యల వేదికగా అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. "తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులందరిలో నేనే సీనియర్. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాను. అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, స్వల్పకాలిక చర్చలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రశ్నోత్తరాల్లో అవకాశం రాకపోతే... లఘు చర్చలు, జీరో అవర్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించడం ద్వారా నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపొచ్చని అన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీ నియమనిబంధనలు తెలుసుకోవాలని అయ్యన్న స్పష్టం చేశారు.
Also Read : మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్
Admin
Studio18 News