Studio18 News - ANDHRA PRADESH / : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడి అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని పవన్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా ప్రజాక్షేత్రంలో నిలిచిందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జరుగుతున్న ఈ తొలి మహానాడు వేదికగా, చంద్రబాబు నాయుడు 12వ సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడి గత పాలనను పవన్ గుర్తుచేసుకున్నారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను 'సైబరాబాద్'గా తీర్చిదిద్ది, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1999లోనే 'ఆంధ్రప్రదేశ్ విజన్ 2020' దార్శనిక పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు, సాంకేతికత ఆధారిత అభివృద్ధికి బాటలు వేశారు" అని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి ప్రజాసేవ పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధత, ఆయన అనుభవ సంపద ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయని పవన్ అన్నారు. దేశాభివృద్ధికి చంద్రబాబు మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, నూతన బాధ్యతల్లో ఆయనకు అన్ని విధాలా విజయం చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ శుభ తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Studio18 News