Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి.. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్న హిందువులే హేళనగా మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. నా చిన్న తనం నుండి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లం. మా కుటుంబం ఆంజనేయ స్వామికి పరమ భక్తులం. అన్ని మతాలను ఈ దేశం సమానంగా తీసుకుంది. వైసీపీలో హిందువులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. వైసీపీలో ఉన్న హిందువులే హేళనగా మాట్లాడుతున్నారు. భూమన కరుణాకరరెడ్డి బాధ్యత తీసుకున్నప్పుడు దేవాలయంలో పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన తిరుమల వెళ్లి హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడు. విచారణకు రావాలి అంటే వైవీ సుబ్బారెడ్డి రికార్డ్స్ కావాలి అంటున్నాడు.. మీరు మాకు ఇచ్చారా..అంటూ పవన్ ప్రశ్నించారు. సుబ్బారెడ్డి విచారణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చూశా. ధర్మారెడ్డి అడ్రెస్సు లేడు.. ఇంత జరుగుతుంటే ఏమయ్యాడు అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొడుకు చనిపోతే నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కు వెళ్ళాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేను బ్లేమ్ చెయ్యడం లేదు.. తప్పు జరిగితే ఒప్పుకోవాలి కదా. తిరుమలతో ఆటలు ఆడతామా.. అన్ని ఆధారాలు ఉన్నాయని పవన్ అన్నారు. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా.. గొడవ పెట్టుకోవాలి అంటే ఎంత గొడవకి అయినా నేను సిద్ధం. సెక్యులరిజం అనేది ఒకే సైడ్ ఉంటే కుదరదు.. అన్ని సైడ్ ల నుండి రావాలి. సాటి హిందువులే.. తోటి హిందువులను తిడుతున్నారు. మసీదు, చర్చిలో ఇలానే జరిగితే వైసీపీ వాళ్ళు ఇలానే మాట్లాడతారా..? పొన్నవోలు పొగరుగా మాట్లాడుతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పొన్నవోలు మధమెక్కింది.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు చెప్తున్నా.. సనాతన ధర్మం జోలికి రాకండి అంటూ పవన్ సూచించారు. హిందువుల గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ కి సంబంధం ఏంటి..? ఏమీ పిచ్చి పట్టింది మీకు. హిందువుల అవమానం జరిగితే మాట్లాడటం తప్పా..? సనాతన ధర్మం పై ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని పవన్ అన్నారు. సనాతన ధర్మంకోసం నేను చనిపోడానికి అయినా సిద్ధం. వైసీపీలో హిందువులు మౌనం వీడండి. దేవుడితో ఆటలు వద్దు.. తరాలు నాశనం అయిపోతాయి. మా సినిమా అభిమానులు సనాతన ధర్మాన్ని పాటించండి. అందరి సినిమా హీరో లు ధర్మం కోసం మాట్లాడండి. హిందువులు అంటే మెత్తని మనుషులు అందుకే హేళన చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఈ ఇష్యూ గురించి మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేకుంటే నోరు మూసుకుని కూర్చోండి అంటూ పవన్ కల్యాణ్ అన్నారు.
Admin
Studio18 News