Studio18 News - ANDHRA PRADESH / : CM Chandrababu Naidu: రాజస్థాన్ రాష్ట్రంలో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మరణించారు. రాజేంద్ర ప్రసాద్ కు కూడా గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బార్ అసోసియేన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆగిఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. బస్సు ప్రమాద ఘటన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన పై రాజస్థాన్ ముఖ్యమంత్రి బజన్ లాల్ శర్మతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని కోరారు. అడ్వకేట్లు తిరిగి ఏపీకి రావడానికి అవసరమైన సహాయం అందించాలని రాజస్థాన్ సీఎంను చంద్రబాబు కోరారు. మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి గొల్లపల్లి జ్యోత్స రాజస్థాన్ లో బస్సు ప్రమాదంలో మరణించిన కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
Admin
Studio18 News