Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులపాటు విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి, కర్నూలుతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరంలో అత్యధికంగా 53 మి.మీ. వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం నమోదయింది. కావలిలో ఆదివారం గరిష్ఠంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, తుని, కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. 3 తుపాన్ల ముప్పు! ఏపీకి అమరావతి వాతావరణ కేంద్రం కీలక వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది. మరోవైపు ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ తుపాన్ల ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Admin
Studio18 News