Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్టోబరు నెల మొత్తం అర్హులైన పెన్షన్ దారుల నమోదు కోసం కేటాయిస్తామని తెలిపారు. దివ్యాంగులు... రూ.6 వేల పెన్షన్ కు అర్హులా? రూ.10 వేల పెన్షన్ కు అర్హులా? లేక వారు రూ.15 వేలు పెన్షన్ కు అర్హులా? అనేది పరిశీలించి, పెన్షన్లు ఇస్తామని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు చంద్రబాబు హెచ్చరికలు చేశారు. "వికలాంగులు కానివాళ్లకు కూడా సర్టిఫికెట్లు ఇస్తే, మీ ఉద్యోగాలకే ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తున్నా. నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో, తప్పులు చేసిన వాళ్ల పట్ల అంత కఠినంగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను" అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. ఇవాళ తాను ఇక్కడికి వచ్చింది ప్రజలతో నేరు మాట్లాడాలన్న ఉద్దేశంతో అని చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో వచ్చానని వివరించారు. మద్దిరాలపాడు గ్రామంలో మూడు ఇళ్లకు వెళ్లానని చంద్రబాబు తెలిపారు. తమ 100 రోజుల పాలన పట్ల వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు రూ.4 వేలు పెన్షన్ గా ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క ఇంటికీ లాభం కలగాలన్నది మా లక్ష్యం. పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామని వివరించారు. ఎన్టీఆర్ రూ.35 తో పెన్షన్లకు శ్రీకారం చుట్టి, ఆ తర్వాత రూ.200 చేశారని... తాను ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్లలో రూ.2 వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వివరించారు. "ఇప్పుడు దాన్ని రూ.4 వేలు చేశాం. అందుకోసం ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చవుతుంది. ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇస్తానని చెప్పాను... ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలో రూ.7 వేలు ఇచ్చాం. ఇటీవల 1వ తేదీ సెలవు వస్తే, ఉద్యోగులు బాధపడకుండా ఒకరోజు ముందే జీతం ఇచ్చాం. మా కూటమి ప్రజాప్రతినిధులు సహా, అధికారులందరూ పేదల ఇళ్లకు రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, మీ కష్టాలు చూసి మీతో అనుసంధానం కావాలని కోరుకున్నాం. మనం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం... మన తర్వాత హర్యానాలో రూ.2,500 ఇస్తున్నారు. మనం ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.
Admin
Studio18 News