Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : AP Rain Alert : ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాత పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని, ఆ తరువాత వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈనెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని, ఈ కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Admin
Studio18 News