Studio18 News - ANDHRA PRADESH / : తమ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్‌లో లేదని, అలా ఉంటే కనుక తన కుటుంబ సభ్యులే సొంత ఖర్చులతో కూల్చేస్తారని మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాల పాటు చిత్తశుద్ధితో పని చేశానని, ఈ విషయాన్ని ఈ రోజు ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమేనని, కానీ తప్పడం లేదన్నారు. ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నానని, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని లేదా పథకాన్ని త్రికరణశుద్ధిగా సమర్థిస్తానన్నారు. వాటి అమలుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వైఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై దృష్టి సారించామని గుర్తు చేశారు. 2005లో సేవ్ మూసీ పేరుతో ఓ పథకాన్ని కూడా వైఎస్ చేతులమీదుగా ప్రారంభించామన్నారు. వైఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు అవసరమని భావించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ముందుకు వెళ్లలేకపోయిందన్నారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టంలో ఎలా వ్యవహరిస్తుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. పేదలకు నష్టం జరగకుండా చేపట్టే కార్యక్రమాలకు తాను మద్దతిస్తానన్నారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని, ఈ విషయం ప్రజలకూ తెలుసునన్నారు. మీ ఆశయాలను దెబ్బతీసే కొంతమంది ప్రయత్నాలను తాను ఖండిస్తున్నానని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. తమ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లేదా ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదన్నారు. అలా ఉంటే కనుక ప్రభుత్వానికి భారం కాకుండా 48 గంటల్లో సొంత ఖర్చుతో కూల్చివేయిస్తామని స్పష్టం చేశారు. అయితే కూల్చివేతల కోసం మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మార్కింగ్ చేసే సమయం, తేదీ ముందే ప్రకటిస్తే తనపై పదేపదే ఆరోపణలు చేసే ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియా తీరిక చేసుకొని వచ్చి ఈ ప్రక్రియను వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. పారదర్శకత కోసం ఇది తన సూచన మాత్రమే అన్నారు.
Admin
Studio18 News