Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. వర్మ గారు చాలా సీనియర్ రాజకీయవేత్త అని వెల్లడించారు. ఆయన కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారని, గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరం చూశామని వివరించారు. అయితే, పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఆయా పార్టీల అధిష్ఠానాలు నిర్ణయం తీసుకుంటాయని నాదెండ్ల స్పష్టం చేశారు. వర్మ విషయం కూడా టీడీపీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆయన పవన్ కల్యాణ్ కు ఎంతో సహకరించారని... ఆయనపై తమకు గౌరవం ఉందని, ఆయనకు సముచిత గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు. పవన్ కల్యాణ్ కూడా... అవకాశం ఉంటే తాను పదవి తీసుకోకుండా ఇతరులకు పదవిని ఇచ్చే వ్యక్తి అని నాదెండ్ల కొనియాడారు. ఇక పెండెం దొరబాబు ఇటీవల జనసేనలో చేరడంపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నాదెండ్ల ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వర్మకు చెక్ పెట్టడానికే దొరబాబును పార్టీలోకి ఆహ్వానించారా? అని ఆ రిప్టోరర్ ప్రశ్నించగా... అలాంటిదేమీ లేదని నాదెండ్ల మనోహర్ బదులిచ్చారు. "దొరబాబు గారు ఎన్నికల ముందే పార్టీలోకి వద్దామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మా కుటుంబంలో ఒకరిగా ఉండే వ్యక్తి... ఎంతో సౌమ్యుడు.... అటువంటి ఆలోచనలేవీ లేవు... చెక్ పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఇది పవన్ కల్యాణ్ గారి నియోజకవర్గం... ఇక్కడ ఎవరికి చెక్ పెడతామండీ? కంప్లీట్ గా పిఠాపురం అనేది పవన్ కల్యాణ్ అడ్డా... ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు" అని నాదెండ్ల వివరించారు.
Admin
Studio18 News