Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చేసుకుంది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. ఈ ఉప ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రద్దు చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే... ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురాజుపై ఆరోపణలు మోపారు. శాసనమండలి చైర్మన్ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. రఘురాజు పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... మండలి చైర్మన్ తీసుకున్న అనర్హత నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇందుకూరి రఘురాపై అనర్హత ఉత్తర్వులు చెల్లవంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేస్తూ... రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో... విజయనగరం స్థానిక సంస్థల ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది. కాగా, ఈ ఉప ఎన్నిక కోసం వైసీపీ తన అభ్యర్థిగా ఇప్పటికే శంబంగి చిన అప్పలనాయుడిని ప్రకటించింది. కానీ ఉప ఎన్నిక రద్దుతో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
Also Read : నాంపల్లిలో కారు బీభత్సం... పలువురికి గాయాలు
Admin
Studio18 News