Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుండి 12వ తేదీ వరకూ రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగుబంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఈ ఉత్సవాల్లో నిత్యం లక్షకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారని అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా దాదాపు నాలుగున్నర వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరో పక్క ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకుచ్చారు.
Admin
Studio18 News