Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు వాడారనే విషయం కలకలం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దారుణాలు జరిగాయని అధికార పక్షం ఆరోపిస్తోంది. గుజరాత్ లోని ల్యాబ్ లో జరిపించిన టెస్టులో ఈ విషయం బయటపడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు. స్వామివారి లడ్డూను వాడుకుని చంద్రబాబు రాజకీయాలు చేయాలనుకున్నారని... అయితే ఆయన ప్రయత్నం బెడిసికొట్టిందని చెప్పారు. తమపై వేసిన అపవాదుకు ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని అన్నారు. వైసీపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు ఫేక్ రిపోర్టుతో జాతీయ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. హిందువులను చంద్రబాబు అవమానించారని... ఆయన వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News