Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆగస్టు నెలలోనే ఆమె పదవీకాలం ముగిసిపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న (సోమవారం) మెమో జారీ చేసింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మెమో జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఇవాళ రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చైర్‌పర్సన్ పదవీకాలం ముగిసిపోవడంతో కమిషన్‌లోని మిగతా సభ్యుల పదవీకాలం కూడా ముగిసిపోయినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు 25 వరకు ఆమె పదవిలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడంతో మార్చి నెలలోనే వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఆమె స్థానంలోనే గజ్జెల లక్ష్మి నియమితులయ్యారు. పదవీకాలం ఆగస్టులోనే ముగిసిపోయినప్పటికీ లక్ష్మి కొనసాగడంతో ప్రభుత్వం మెమో జారీ చేసింది. కాగా ముంబై నటి కాదాంబరి జెత్వానీ వ్యవహారంపై గజ్జెల లక్ష్మి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, సుమోటోగా తీసుకోలేమని అనడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News