Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Minister Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ వాహనదారుడికి క్షమాపణలు చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లోకేశ్ విశాఖ పట్టణంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ కాన్వాయ్ లోని వాహనం రోడ్డుపక్కన ఓ వ్యక్తి నిలిపిన కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ విషయాన్ని కల్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతా ద్వారా లోకేశ్ కు తెలియజేశారు. లోకేశ్ గారూ.. నేను మీ పరిపాలనను, టీడీపీని చాలా ఇష్టపడతాను. ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు గర్విస్తున్నాను. కానీ, ఈరోజు విశాఖపట్టణం హైవే వద్ద తాటిచట్లపాలెం దగ్గర మేము మీ కాన్వాయ్ వెళ్లేందుకు మా కారును రోడ్డు పక్కన నిలిపాము. మీ కాన్వాయ్ లోని ఓ వాహనం మా కారును ఢీకొని వేగంగా వెళ్లిపోయిందని కళ్యాణ్ భరద్వాజ్ పేర్కొన్నాడు. కారుకు డ్యామేజ్ అయిన చిత్రాలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. వెంటనే లోకేశ్ అతని ట్వీట్ కు స్పందించారు. మీకు నా హృదయపూర్వక క్షమాపణలు. నేను నా భద్రతా సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశిస్తాను. నా బృందం మిమ్మల్ని కలుస్తుంది. కారుకు అయిన డామేజ్ ను సరిచేసేందుకు అయ్యే ఖర్చును భరిస్తారని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Admin
Studio18 News