Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరసగా పార్టీని వీడుతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పార్టీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ... ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు. పాలనలో వైసీపీ అన్ని విధాలుగా విఫలమయిందని విమర్శించారు. ఎంసెట్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని అన్నారు. అందుకే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు దూరం పెట్టారని, వైసీపీలో తాను ఇమడలేకపోతున్నానని పేర్కొన్నారు. కాగా, వైసీపీ ప్రారంభం నుంచి పార్టీలో రెహ్మాన్ చురుకుగా వ్యవహరించారు. రెహ్మాన్ పార్టీని వీడటం ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. మరోవైపు రెహ్మాన్ టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.
Admin
Studio18 News