Studio18 News - ANDHRA PRADESH / : Shanti homam at Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఉదయం 10గంటల వరకు శాంతి హోమం కొనసాగనుంది. హోమం పూర్తి తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఇవాళ రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ముందుగా శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరుగుతుంది. వాస్తు హోమం అనంతరం అడ్డూపోటు, విక్రయశాలలో వాస్తుశుద్ది. వాస్తు శుద్ది అనంతరం శ్రీవారి ఆలయంలో శాంతి హోమం. అనంతరం పూర్ణాహుతి పండితులు నిర్వహించనున్నారు. పూర్ణాహుతి తరువాత ఆలయం సహా అన్ని పోటుల్లో పంచగవ్య సంప్రోక్షణ నిర్వహించనున్నారు. బూందీ పోటు, లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటులో పంచగవ్య సంప్రోక్షణ చేయనున్నారు. అయితే, శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. తిరుమల ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హోమం తరువాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. ఇదిలాఉంటే.. ఆదివారం తిరుమల శ్రీవారిని 82,436 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు సమకూరించింది. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతుంది.
Admin
Studio18 News