Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Samsung company Tamilanadu : ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీకి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో మ్యానిఫాక్చరింగ్ యూనిట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, అక్కడ గత నెల రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమను యూనియన్ గా గుర్తించడంతోపాటు వేతన సవరణ, ఎనిమిది గంటల పని, ఇతర ప్రయోజనాలను కోరుతూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఆందోళకారులతో కంపెనీ ప్రతినిధులు పలు దఫాల చర్చలు జరిపారు. కొన్ని డిమాండ్లకు అంగీకరించినా.. మరికొన్ని డిమాండ్లపై చర్చకుసైతం కంపెనీ ప్రతినిధులు అంగీకరించలేదు. కార్మికుల ప్రధాన డిమాండ్ యూనియన్ గుర్తింపునకు మాత్రం శాంసంగ్ కంపెనీ ససేమీరా అంది. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి రాష్ట్ర కార్మిక శాఖ కోర్టు ఆదేశాలను అమలు చేస్తుందని హామీ ఇచ్చినప్పటికీ కార్మికులు ఆందోళన విషయంలో వెనక్కి తగ్గలేదు. కార్మికుల ఆందోళనతో శాంసంగ్ యూనిట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. సెప్టెంబర్ 9 నుంచి సమ్మె కొనసాగుతుంది. పలువురు కార్మికులనుసైతం పోలీసులు అరెస్టు చేశారు. కార్మికుల ఆందోళన కారణంగా కంపెనీ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, శ్రీపెరంబుదూర్ ప్లాంట్ ను వేరే రాష్ట్రానికి మార్చే ఆలోచనలో కంపెనీ ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా శ్రీసిటీ అధికారులు శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది. శ్రీసిటీకి కేవలం 75 కిలో మీటర్ల దూరంలోనే తమిళనాడులోని శాంసంగ్ శ్రీ పెరంబుదూర్ ప్లాంట్ ఉంది. శ్రీసిటీ అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఆగస్టు నెలలో రూ.3,700 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులను ప్రారంభించి, అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. శ్రీసిటీకి చెందిన అధికారులు మిమ్ములను సంప్రదించారా అని అడిగినప్పుడు శాంసంగ్ ప్రతినిధి దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. తాజాగా ఈ విషయంపై.. శాంసంగ్ ప్రతినిధి బిజినెస్ స్టాండర్డ్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు మూడు దశాబ్దాలుగా భారతదేశ వృద్ధి ప్రయాణంలో శాంసంగ్ బలమైన భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవకు కట్టుబడి ఉంది. మేము భారత ప్రభుత్వం, ప్రస్తుతం మేముఉన్న వివిధ రాష్ట్రాలతో కలిసి పని చేస్తూనే ఉంటాము.. మద్దతు ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. శాంసంగ్ కంపెనీ మరో రాష్ట్రానికి మారబోతుందా అనే ప్రశ్నకు తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు సమాధానంమిస్తూ.. తమిళనాడు అన్ని కంపెనీలకు అనుకూలమైన రాష్ట్రం. శాంసంగ్ ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లదు. అలాంటి పరిస్థితికి అవకాశమే లేదని చెప్పారు.
Admin
Studio18 News