Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి తాజాగా మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు. అయితే, వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె కమలం పార్టీలో చేరడం గమనార్హం. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జకియా ఖానం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం 2020 జులైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అనంతరం ఆమె శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా కూడా ఎన్నికయ్యారు. కొంతకాలంగా వైసీపీ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్న జకియా ఖానం తాజాగా తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు చేరింది.
Admin
Studio18 News