Studio18 News - ANDHRA PRADESH / : Ys Sharmial Reddy : లిక్కర్ షాపుల టెండర్ల వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు.. మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారు కదా అని విమర్శించారు. ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై, సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని తెలిసిందన్నారు షర్మిల. కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు దక్కాయంటే.. మీ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ సాగిందని షర్మిల ఆరోపించారు. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రాణాలు పోతాయని హెచ్చరికలు చేశారని ధ్వజమెత్తారు. కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరికైనా లాటరీ చిక్కితే లైసెన్స్ ఇస్తారా? అని షర్మిల ప్రశ్నించారు. లేక 30 శాతం కమీషన్ ఇస్తారా? లేకుంటే చస్తారా? అంటూ బెదిరించారని ఆరోపించారు. ”మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తాం అంటూ బహిరంగంగానే సవాళ్లకు పాల్పడ్డారు. సీఎం గారు.. ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి ? గత వైసీపీ “ఓన్లీ క్యాష్” అని గుడిని మింగేస్తే ఇప్పుడు మీరు లింగాన్ని మింగేస్తున్నారు. ప్రైవేట్ పేరుతో తక్కువ ధర అని చెప్పి మద్యం ఏరులై పారించి, వేల కోట్ల దోపిడీకి కూటమి సర్కార్ తెరలేపింది. అందుకేనేమో మీ పాపాల చిట్టాలు రేపు బయటపడకుండా ఉండటం కోసం, పాత సర్కార్ మద్యం స్కామ్ లోని పాపాలపుట్టలు బద్దలుకాకుండా జాగ్రత్త పడుతున్నారు” అని షర్మిల అన్నారు.
Admin
Studio18 News