Studio18 News - ANDHRA PRADESH / : ఈసారి భానుడు చెలరేగిపోతున్నాడు. వేసవి ప్రారంభానికి ముందే గుబులు పుట్టిస్తున్నాడు. మార్చి ముగియక ముందే ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటేసింది. దీంతో బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. మున్ముందు ఎండలు మరింత మండిపోతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక నేడు రాష్ట్రంలోని 202 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. విజయనగరం జిల్లాలోని 15 మండలాలు, పార్వతీపురం మన్యంలో 12, శ్రీకాకుళంలో 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, పల్నాడు జిల్లాలో 19 మండలాలు, తూర్పుగోదావరిలో 19, అనకాపల్లిలో 16, శ్రీకాకుళంలో 16, కాకినాడలో 15, గుంటూరులో 14, ఏలూరులో 13, కృష్ణాలో 10, విజయనగరంలో 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9, ఎన్టీఆర్ జిల్లాలో 8, పార్వతీపురం మన్యంలో 3, పశ్చిమ గోదావరిలో 3, విశాఖలో 2, బాపట్ల జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. నిన్న అనకాపల్లి జిల్లా నాతవరంలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా పెదనందిపల్లిలో 41.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.4, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట, అయ్యప్పపేటలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Admin
Studio18 News