Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను విజయవాడకు తరలించి శుక్రవారం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇసుక గుత్తేదారు సంస్థలైన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. ఆయన చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 2,566 కోట్ల మేర నష్టం వచ్చిందన్నారు. వెంకటరెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు. మరోవైపు వెంకటరెడ్డి తరఫు న్యాయవాది రిమాండు విధించవద్దని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు.. వెంకటరెడ్డికి వచ్చే నెల 10వ తేదీ వరకూ రిమాండు విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో అధికారులు ఆయన్ను విజయవాడ కారాగారానికి తరలించారు. ఇక వెంకటరెడ్డిని కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
Admin
Studio18 News