Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అత్యాచారానికి గురైన బాలిక పేరును మీడియాకు వెల్లడించారనే ఆరోపణలపై మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పై విజయవాడలో కేసు నమోదైన విషయం తెలిసిందే. మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. విచారణకు రమ్మంటూ మాజీ ఎంపీకి నోటీసులు జారీ చేయగా.. ఎట్టకేలకు గురువారం విజయవాడ పోలీసుల ముందు మాధవ్ హాజరయ్యారు. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న సీనియర్ అధికారి గుణరామ్ ముందుకు వచ్చారు. మధ్యాహ్నం 12:45 గంటలకు లోపలకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ 1:30 గంటలకు బయటకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు తనకు పది ప్రశ్నలు సంధించారని, అన్నింటికీ జవాబు చెప్పానని తెలిపారు. అత్యాచార బాధితురాలి పేరును ప్రస్తావించిన విషయం తనకు గుర్తులేదన్నారు. అధికారులు తనకు వీడియో చూపించారని, ఆ వీడియో తనదేనని చెప్పారు. అయితే, అందులో వినిపించిన గొంతు మాత్రం తనది కాదని గోరంట్ల చెప్పారు. మళ్లీ పిలిస్తే విచారణకు హాజరు కావాలని చెప్పారన్నారు. మరోమారు తనకు నోటీసులు ఇచ్చారని వివరించారు. పోలీసుల విచారణకు వస్తూ గోరంట్ల మాధవ్ తన వెంట ఇద్దరు లాయర్లను తీసుకుని వచ్చారు. పోలీసులు మాత్రం ఒక్క లాయర్ ను మాత్రమే లోపలికి అనుమతించడంతో అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసు అధికారులతో మాధవ్ లాయర్ వాగ్వాదానికి దిగారు. చివరకు ఒక్క లాయర్ తోనే మాధవ్ లోపలికి వెళ్లారు. మరోవైపు, ఈ కేసులో విచారణ అధికారి గుణరామ్, నిందితుడు గోరంట్ల మాధవ్ ఇద్దరూ బ్యాచ్ మేట్లని తెలిసింది. 1996లో ఇద్దరూ ఎస్సైలుగా ఎంపికయ్యారని, శిక్షణ తర్వాత విధుల్లో చేరారని సమాచారం. సీఐగా ప్రమోషన్ పొందిన మాధవ్.. ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News