Studio18 News - ANDHRA PRADESH / : భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు (నవంబరు 14) సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటుండడం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ నేడు సోషల్ మీడియాలో స్పందించారు. పిల్లలను ఎలా చూసుకుంటున్నదనే దానిపైనే ఒక సమాజం అసలు స్వభావం తెలుస్తుందని నెల్సన్ మండేలా పేర్కొన్న విషయాన్ని నారా భువనేశ్వరి ప్రస్తావించారు. ఒక ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పాలంటే ఆ ప్రభుత్వం పిల్లల కోసం ఏం చేస్తుందనేది చూడాలి అని అభిప్రాయపడ్డారు. "చంద్రబాబు గారు... గతంలో బాలల హక్కుల రక్షణకు భారత యాత్ర చేపట్టిన కైలాస్ సత్యార్థి గారితో పాటు వీధుల్లో పాదయాత్ర చేశారు. బాలలపై లైంగిక దాడులు, అక్రమ తరలింపు వంటి చర్యలను అరికట్టేందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలతో కలిసి వీధుల్లో పాదయాత్ర చేయడం భారతదేశంలోనే మొదటిసారి. చిన్నారుల పట్ల ఆయన ఎంత నిజాయతీతో, బాధ్యతతో పనిచేస్తారో చెప్పడానికి అదొక ఉదాహరణ. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే కాదు... సమాజం మొత్తానికి ఉంది. ఆ బాధ్యతను నైతికంగా నెరవేర్చడం ద్వారా... రేపటి సమాజాన్ని ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుదాం" అంటూ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు
Also Read : 18 ఏళ్ల తర్వాత మళ్లీ రమణ గోగుల!
Admin
Studio18 News