Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై ఆయన తమ్ముడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. నానికి వెన్నుపోటు రాజకీయాలు అలవాటుగా మారాయని, ఆయన టీడీపీ ద్వారా గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని చిన్ని ధ్వజమెత్తారు. జగన్ వద్ద నాని పాలేరుగా చేరారని విమర్శించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవినే విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో రూ. 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వ్యక్తే సూత్రధారి అని కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో, రాజ్ కసిరెడ్డితో పాటు మరో ముగ్గురికి మాత్రమే ప్యాలెస్‌లోకి ప్రవేశం ఉందని తెలిపారు. ఈ ఆరోపణలపై తాను సీబీఐ విచారణకు సిద్ధమని, జగన్ కూడా సిద్ధమా? అని చిన్ని సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే నాని తనపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్ కసిరెడ్డితో తాను వ్యాపార లావాదేవీలు జరిపిన మాట వాస్తవమేనని అంగీకరించిన చిన్ని... కసిరెడ్డికి జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత ఆయనకు తాను దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్, ఇసుక మాఫియాపై నాని ఎందుకు ఒక్కసారైనా ప్రశ్నించలేదని నిలదీశారు. తాను నికార్సైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధినని, బురద రాజకీయాల జోలికి వెళ్లనని కేశినేని చిన్ని పేర్కొన్నారు. జగన్ కార్యాలయాల్లోనే లిక్కర్ స్కామ్ లావాదేవీలు జరిగాయని, దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశానని, 24 గంటల్లో జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News