Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు తిరుమల లడ్డూపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ... విజయవాడలోని దుర్గమ్మ లడ్డూ తయారీలో కూడా లోపాలు ఉన్నట్టు బయటపడ్డాయి. దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వినియోగించే జీడిపప్పు ప్యాకెట్లపై లేబుల్స్ లేవని తనిఖీల్లో వెల్లడైంది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి. కాంట్రాక్టర్లు నాసిరకం సరుకు సరఫరా చేస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. నాణ్యత లేని 1,100 కిలోల కిస్మిస్, 700 కిలోల జీడిపప్పును అధికారులు తిప్పి పంపించారు. ఇంకోవైపు లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి, బెల్లం, శెనగపప్పు నమూనాలను కూడా పరీక్షించేందుకు హైదరాబాదుకు పంపించారు.
Admin
Studio18 News