Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఊరెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కిన మహిళపై బస్సులోని హెల్పర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటపెడితే నీ పరువే పోతుందంటూ భయపెట్టాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన ఓ మహిళ కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. సొంతూరు వెళ్లేందుకు ఈ నెల 18న రాత్రి 10.40 గంటల సమయంలో కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఆమె అప్పర్ బెర్త్ బుక్ చేసుకుంది. అయితే, ఆమెపై కన్నేసిన బస్సు హెల్పర్.. వెనకాల లోయర్ బెర్త్ ఖాళీగా ఉందని చెప్పి అక్కడికి పంపాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చే నెపంతో ఆమె వద్దకు వెళ్లిన నిందితుడు మాటలు కలిపాడు. ఆపై ఆమె నోరు నొక్కి, విండో కర్టెన్లు మూసి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే నీ పరువే పోతుందని హెచ్చరించాడు. ఆమె ఇంటికి చేరుకున్నాక యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆయన వెంటనే ఆమెను హైదరాబాద్‌కు పిలిపించాడు. బస్సు బయలుదేరిన రెండు గంటల తర్వాత ఘటన జరగడంతో చౌటుప్పల్ పరిధిలో జరిగి ఉంటుందని భావించి అక్కడ ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు అనంతరం దానిని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Admin
Studio18 News