Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమ్మవారి జన్మనక్షత్రమైన ఈరోజున ఆమెను దర్శించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తిరుమల తర్వాత రెండో అతి పెద్ద దేవాలయం విజయవాడ దుర్గగుడి అని అన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. దుర్గ గుడిలో ఈసారి ఉత్సవ కమిటీని కాకుండా... సేవా కమిటీని వేశామని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 67,931 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. త్వరలోనే నదుల అనుసంధానం ఉంటుందని తెలిపారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తికావాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. మరోవైపు, దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చిన్నరాజగోపురం వద్ద ముఖ్యమంత్రి తలకు అర్చకులు పరివేష్టం చుట్టారు. ఆ తర్వాత మేళతాళాల మధ్య అమ్మవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.
Admin
Studio18 News