Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Damacharla – Balineni : ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో భేటీకాగా.. ఈ నెల 26న జనసేన కండువా కప్పుకోనున్నారు. బాలినేని వెంట ఆయన అనుచరులు కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరికపట్ల నియోజకవర్గంలోని కూటమి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు జనసేన పార్టీలోని రియాజ్ వర్గం అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిపై కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని, కొందరిపై అక్రమ కేసులు బనాయించారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయన్న భయంతోనే జనసేన పార్టీలోకి బాలినేని వస్తున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీల్లోని కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. బాలినేని జనసేన పార్టీలో చేరుతారని ఖారారు కావటంతో మరోసారి బాలినేని, దామచర్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బాలినేని, దామచర్ల, వారి వర్గీయులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బాలినేని పవన్ కల్యాణ్ తో భేటీ అయినరోజు ఒంగోలులో బాలినేని ప్లెక్సీని ఆయన అనుచరులు ఏర్పాటు చేశారు. అందులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంటు శ్రీనివాసులు రెడ్డి ఫొటోలను ముద్రించారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహంతో ఆ ప్లెక్సీలను తొలగించారు. ఈ క్రమంలో బాలినేని, దామచర్ల వర్గీయుల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. వీరికితోడు దామచర్ల వర్సెస్ బాలినేనిలు మాటల తూటాలు పేల్చుకోవటంతో వీరి వ్యవహారం జనసేన, టీడీపీ అధిష్టానాలకు తలనొప్పిగా మారింది. ఇరువురు నాయకులు ఒకరిపై మరొకరు అవాకులు చవాకులు పేల్చుకోవడంపై జనసేన, టీడీపీ అదిష్టానాలు దృష్టి సారించాయి. మున్ముందు ఏమైనా సమస్యలువస్తే తమ దృష్టికి తేవాలని, కిందిస్థాయిలో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ బజారుకెక్కరాదంటూ ఇరువురు నేతలకు ఆయా పార్టీల అధినాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. మీ మధ్య విబేధాల ద్వారా రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్య సఖ్యత దెబ్బతినకూడదని బాలినేని, దామచర్లకు పవన్, చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. తాజా వివాదం నేపథ్యంలో బాలినేనికి పవన్ కల్యాణ్ కొన్ని నిబంధనలు విధించినట్లు తెలిసింది. జనసేన పార్టీలో చేరిన తరువాత పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని, కూటమి పార్టీల మధ్య విబేధాలు తలెత్తేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, అందరిని కలుపుకొని పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించినట్లు సమాచారం. దీనికితోడు వివిధ కారణాల దృష్ట్యా జనసేన పార్టీలో చేరిక కార్యక్రమానికి పరిమితంగానే నాయకులను తీసుకురావాలని పవన్ కల్యాణ్ బాలినేనికి సూచించినట్లు ఒంగోలు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.
Admin
Studio18 News