Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, దానిని హుందాగా నెరవేర్చాలని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో డయాలసిస్ సెంటర్ ప్రారంభించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్న లోకేశ్.. ఈ ఉదయం ఎస్‌ఎల్‌వీ కల్యాణమండపంలో నిర్వహించిన ‘ఉత్తమ కార్యకర్త’ ‘మన టీడీపీ యాప్ ఛాంపియన్స్’తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారెంటీ 2023-24 కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మన టీడీపీ యాప్ ద్వారా ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. నాపై 23 కేసులు పెట్టారు 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేసిందని, తనపై అక్రమంగా 23 కేసులు నమోదు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐదేళ్లు బాగా కష్టపడ్డారని కొనియాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ప్రజలు 164 సీట్లు ఇచ్చి మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, దానిని హుందాగా నెరవేరుద్దామని పేర్కొన్నారు. వ్యవస్థలను నాశనం చేసిన అధికారులపై చర్యలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంతోపాటు వ్యవస్థలను నాశనం చేసిన అధికారులు, నాయకులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశామని, క్యాన్సర్ గడ్డలా మారిన పాపాల పెద్దిరెడ్డిని వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీచేశారు. 100 రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చాం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చామని, మెగా డీఎస్సీ ద్వారా 16,400 పోస్టులు భర్తీ చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. వృద్ధాప్య పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, దివ్యాంగ పెన్షన్ ను రూ. 3వేల నుంచి రూ.6 వేలకు పెంచామని, శాశ్వత అంగవైకల్యం ఉన్నవారి పెన్షన్ రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచామని తెలిపారు. పేదవారి ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 2019 కంటే తక్కువ ధరకు ఇసుక అందేలా చూస్తామని పేర్కొన్నారు. పాదయాత్రలో రోజుకో అబద్ధం చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టో గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్రలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాటతప్పారని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అమలుచేయలేదని విమర్శించారు. టీటీడీ పవిత్రతను కాపాడతాం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని విని షాకయ్యామని, ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌లు కూడా బయటపెట్టినట్టు లోకేశ్ తెలిపారు. తిరుమలలో ప్రమాణానికి సిద్ధమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారని, తాను తిరుపతిలోనే ఉన్నానని, ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు. దేవుడి దగ్గర కూడా వారు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని, తిరుమల పవిత్రతను కాపాడతామని పేర్కొన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని లోకేశ్ వివరించారు. పనిచేయడంతో పాటు చేసిన పనిని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు, నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజా ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరించాలని కోరారు. తాను అందరికీ అందుబాటులో ఉంటాననని, కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. సీనియర్లను గౌరవిస్తామని, కష్టపడి పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.
Admin
Studio18 News