Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలపై శాసనమండలిలో నేడు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. ఇకపై ఏపీలో టీచర్లకు యాప్ ల భారం ఉండదని స్పష్టం చేశారు. ఉధ్యాయులపై గతంలో పెట్టిన కేసులను ఎత్తివేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని, దాని ఫలితంగానే విద్యార్థులు నైపుణ్యాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించి, రాబోయే నాలుగేళ్లలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, దీనికి ప్రధాన కారణం జీవో 117 అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ జీవో కారణంగానే అనేక పాఠశాలలు మూతపడ్డాయని, సింగిల్ టీచర్ పాఠశాలల సంఖ్య పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గత ప్రభుత్వం రికార్డులను తారుమారు చేసిందని, డ్రాప్ బాక్స్ వ్యవస్థ ద్వారా లక్షల మంది విద్యార్థుల వివరాలను తప్పుగా చూపించారని ఆరోపించారు. దీనివల్ల డ్రాపౌట్ రేటు 12.5%కి పెరిగిందని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులకు నిధులు విడుదల చేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, నోట్ బుక్స్, చిక్కీలు, గుడ్లు వంటి వాటిపై గత ప్రభుత్వం నాయకుల ఫోటోలు వేసుకుందని విమర్శించారు. ప్రస్తుతం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లు అందిస్తున్నామని, వాటిపై ఎలాంటి రాజకీయ రంగులు, నాయకుల ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. పాఠశాలల్లో పిల్లల పుస్తకాల బరువు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని, సెమిస్టర్ విధానంలో మొదటి సెమిస్టర్ కు రెండు పుస్తకాలు, రెండో సెమిస్టర్ కు రెండు పుస్తకాలు చొప్పున అందిస్తామని తెలిపారు. సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. టోఫెల్ విధానం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, ఐబీ స్కూల్స్ కోసం గత ప్రభుత్వం రూ.5 కోట్లు వృథా చేసిందని ఆరోపించారు. ఉన్నత విద్యారంగంలోనూ సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,282 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఒక యూనిఫైడ్ చట్టం తీసుకువస్తామని, తద్వారా వాటి కార్యకలాపాల్లో మరింత పారదర్శకత ఉంటుందని చెప్పారు. నూతన విద్యా విధానంలో భాగంగా డీప్ టెక్ యూనివర్సిటీ, ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చివరగా, విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ సహకరించాలని మంత్రి లోకేశ్ కోరారు.
Admin
Studio18 News