Studio18 News - ANDHRA PRADESH / : అమరావతి రైతులను గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా హింసించిందని టీటీడీ ఛైర్మన్, టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత అమరావతి రైతులకు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రైతు బిడ్డగా అమరావతి రైతులకు అండగా నిలిచానని... కేసులు పెట్టినా వెనకడుగు వేయలేదని చెప్పారు. బీఆర్ నాయుడుకి వెలగపూడిలో రాజధాని రైతు ఐకాస ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సూచన మేరకు అమరావతి రైతులతో తాను సమావేశమయ్యానని బీఆర్ నాయుడు తెలిపారు. విజయవాడ, రాజమండ్రిలో అమరావతి రైతులు, మహిళల పాదయాత్రలో పాల్గొన్నానని చెప్పారు. అమరావతిలాంటి ఉద్యమాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. రాజధాని రైతులు, మహిళల కన్నీరులో వైసీపీ కొట్టుకుపోయిందని చెప్పారు. అమరావతి ఉద్యమం విజయవంతం అయినందున ఈ నెల 15న శ్రీనివాసుడి కల్యాణం నిర్వహిస్తున్నామని... ఆ కార్యక్రమంలో అమరావతి రైతులందరూ పాల్గొన్నారని కోరారు.
Admin
Studio18 News