Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రోడ్డు పక్కగా నిలిపి ఉంచిన ట్రావెల్స్ బస్సును ఓ కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది.. దీంతో బస్సు వెనకభాగంలో తీవ్రంగా దెబ్బతినగా బస్సులో నిద్రిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటుచేసుకుందీ ఘోర రోడ్డు ప్రమాదం. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద ఫెయిలైంది. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా పార్క్ చేసి మరమ్మతు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. బస్సులో ప్రయాణికులు కొంతమంది నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కంటైనర్ లారీ వేగంగా దూసుకువచ్చి బస్సును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు వెనకభాగం తీవ్రంగా దెబ్బతింది. లోపల సీట్లలో పడుకున్న ప్రయాణికులలో ఇద్దరు యువకులు చనిపోయారు. వారిద్దరూ ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన సతీశ్ కుమార్, తేజగా పోలీసులు గుర్తించారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు.. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Admin
Studio18 News