Studio18 News - భక్తి / : Sravana Masam 2024 : తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం రెండవ శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో తెల్లారుజామున 5గంటలకే అమ్మవారి పూజ ప్రారంభించారు. ఉదయం సువర్ణ వస్త్ర అలంకరణ పూర్తయింది. అమ్మవారికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 6గంటలకు వరలక్ష్మీ వ్రతంను ఆచరించారు. అష్టలక్ష్మీ ఆలయంలో మరో మూడు రోజులుపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సాయంకాలం నుండి ఉదయం వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మూడు రోజులపాటు అంకురార్పణ, హోమాలు.. పవిత్రారాధన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ కొనసాగుతుంది. 11గంటలకు గోపూజ నిర్వహించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో తెల్లవారు జామున 5గంటలకే అమ్మవారి పూజ పార్రంభమైంది. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎంతో ప్రత్యేకం. దీంతో తెల్లవారు జాము నుంచే అమ్మవారి దర్శనంకోసం పెద్దెత్తున భక్తులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వనదుర్గమాతను తామర పుష్పాలతో ఆలయ అర్చకులు అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం కావడంతో ఏడుపాయల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగనుంది.
Admin
Studio18 News