Studio18 News - భక్తి / : Ganesh Chaturthi 2024 : గణనాథుడి పుట్టుక చిత్రం. పునర్జన్మ విచిత్రం. వినాయకుడి గాథలు చిత్ర విచిత్రం. అమ్మచేతిలో పసుపు ముద్దగా అవతరించి.. గణపతిగా అనాదిగా తొలి పూజలు ఆయనకే అందుతున్నాయి. ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతీ ఏటా వినాయక చవితిని 3 నుంచి 11 రోజుల వరకు జరుపుకుంటారు. వినాయక చవితి ఎప్పుడూ బాధ్రపద మాసం..అంటే ఆగస్ట్..సెప్టెంబర్ నెల్లల్లోనే వస్తుంది. వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు. పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్టించిన చోటే ఉంచి పూజిస్తారు. హిందువుల తొలి పండుగ.. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే గణనాథుడు పుట్టాడని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. గణేశుడి ఆవిర్భావ గాథలు పురాణాలలో రకరకాలుగా చెప్పబడ్డాయి. శివపురాణం ప్రకారం.. ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి శరీరానికి నలుగుపిండిని రాసుకుంది. మిగిలిన నలుగుపిండితో ఒక బొమ్మను తయారుచేసి ప్రాణం పోసింది. అతడిని ద్వారం దగ్గర కాపలాగా పెట్టింది. శివుడు వచ్చి లోపలికి వెళ్లబోతుండగా కాపలా ఉన్న బాలుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆగ్రహంతో శివుడు ఆ బాలుడి తలను త్రిశూలంతో నరికివేశాడు. తల తెగి పడివున్న బాలుడిని చూసి పార్వతీదేవి ఏడ్చేసింది. ఆమె రోదనను చూడలేక శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టాడు. తన కారణంగా ఆ బాలుడు వికారరూపాన్ని పొందాడని గజాననుడు తొలిపూజ అందుకోనున్నట్లు వరం ఇచ్చేశాడు. మట్టి గణపతినే ఎందుకు పూజించాలి..? మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గలపురాణం స్పష్టంగా చెబుతుంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట. ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం- ఈ నాలుగింటి పరిపూర్ణ, దివ్య తత్త్వమే గణపతి స్వరూపం. బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడు అని పార్వతికి శివుడు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వ సాధారణం. పదివేల ఏనుగుల బలం కలవాడు, మహా బలశాలి అని లంబోదరుడ్ని కొలుస్తారు. గజవదనుడైన గణపతి బలానికి సంకేత రూపం. ఇంకొక కోణంలో, ఏనుగు ఐశ్వర్యానికి సూచన. గణపతిని సంపదలకు దేవతగా, ప్రదాతగా భావిస్తారు. శివపార్వతుల తనయుడిగానే కాకుండా, శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. విజయాలు ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు.. మనలో ఉన్న పాపాలు తొలగిపోతే మంచి బుద్ధి కలుగుతుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి, మనిషి ప్రయాణం మోక్షం దిశగా సాగుతుంది. గణపతి అనుగ్రహం కూడా తోడైతే.. మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు. కోరిన విద్యలకెల్ల గురువు అని స్వామిని పూజించడం పరిపాటి. అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపజేసే సత్సంప్రదాయం మనకు ఉంది. గణం అంటే గుంపు. సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి. నాయకత్వ లక్షణాలకూ ఆయనే అధినాథుడు. కోరినవి సిద్ధింపజేయడంతో వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి అడ్డంకులు. వాటినే విఘ్నాలు అంటారు. అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయాలు ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు. గణేశుడు భక్తజన సంరక్షకుడు… ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ అందుకునే ఇలవేల్పు గణనాథుడు. సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతి పురాణకాలం నుంచి నుంచి పూజలందుకుంటున్నారు. గణేశుడికి పలు పేర్లు ఉన్నాయి. సకల విఘ్నాలను హరించువాడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు అని అర్థం. గణేశుడు భక్తజన సంరక్షకుడు. తూర్పుదిక్కున హేరంబుడు, పడమర దిక్కున వక్రతుండుడు, దక్షిణం వైపున లంబోదరుడు, ఉత్తరం వైపున గణపతి, ఈశాన్యం వైపున ఈశానందుడు, ఆగ్నేయం వైపున అగ్నితేజసుడు, నైరుతి వైపున పార్వతీసుతుడు, వాయువ్య దిక్కున వరదుడు అనే నామాలతో భక్తులను సంరక్షిస్తుంటాడు. లంబోదరుడి పూజలో 21 రకాల పత్రి విశేషాలేంటి.? చవితి పూజలో 21 రకాల ఆకులు వాడుతాం. నవరాత్రుల పూజల తర్వాత ప్రతిమను, పత్రిని నిమజ్జనం చేయడం సంప్రదాయం. పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలన్నవే. వానలు కురిసే ఈ సమయంలో చెరువులు కలుషితం అవుతాయి. నీటిని శుద్ధి చేయడానికి ఈ 21 రకాలు పత్రి సరైన మార్గమని చెప్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆ ఆకులన్నీ నీటిలో కలిసినప్పుడు..అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయి..నీళ్లు క్లీన్ అవుతాయని అంటున్నారు. గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం ఎందుకు.? పూజ, వ్రతం, నోము ఏది చేసినా ముందుగా గణపతిని పూజించాలనేది సంప్రదాయం. చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తాం. ముందుగా పసుపుతో గణపతిని చేసి..తర్వాత స్వామివారిని ఆహ్వానించి వత్రం చేస్తారు. ఇక గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి. చవితి రోజు వినాయకుడికి అర్పించే గరికకు చాలా ప్రత్యేకత ఉంది. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి..దేవతల్ని ఇబ్బంది పెట్టాడట. అప్పుడు ఎంత ప్రయత్నించిన గణపతికి వేడి తగ్గకపోవడంతో 21 గరిక పోచలను తలపై పెట్టాలని రుషులు సూచించారట. ఆ వెంటనే వినాయకుడి శరీరంలో వేడి తగ్గిందట. అందుకే గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా సమర్పించే కుడుముల్లోనూ ఆరోగ్య సూత్రం ఉంది. వర్షాకాలంలోనే వినాయక చవితి వస్తుంది. రెయిన్ సీజన్‌లో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సమయంలో జీర్ణవ్యవస్థ కాస్త వీక్‌గా ఉంటుంది. అందుకే ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకుంటే జీర్ణవ్యస్థ ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. అందుకే వినాయకునికి కుడుములు అంటే చాలా ఇష్టమంటున్నారు. చవితి రోజు చంద్రుడ్ని చూస్తే ఏ పరిహారం చేయాలి.? పూజ, నైవేద్యం ప్రత్యేకతలు ఇలా ఉంటే..వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు. పొరపాటున చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుందంటారు. వినాయక చవితి రోజు ముందుగా పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత ప్రతిష్టించిన విగ్రహానికి పూజ పూర్తిచేస్తారు. పూజంతా అయిన తర్వాత కథ చదువుకుని అక్షింతలు భగవంతుడిపై వేసి అవే అక్షింతలు తీసుకుని తలపై వేసుకుంటారు. ఇలా చేస్తే నిందలు పడాల్సిన అవసరం లేదని..చవితి రోజు చంద్రుడిని చూసినా పర్వాలేదని చెబుతారు. వినాయకుడు జ్ఞానస్వరూపం, అగ్రపూజ్యనీయుడు. ఈ విషయం మరిచిపోయిన చంద్రుడు.. గణనాథుడి వింతరూపాన్ని చూసి, కిందకు వంగి తల్లిదండ్రులకు నమస్కరించలేకపోవడం చూసి నవ్వుతాడు. అది చూసి పార్వతీదేవికి కోపం వస్తుంది. ఇకపై చవితి రోజు చంద్రుడ్ని చూసినవారికి నీలాపనిందలు తప్పవనే శాపం ఇచ్చింది. అయితే వినాయక చవితి రోజు కథ చెప్పి అక్షింతలు తలపై వేసుకునేవారు చంద్రుడిని చూసినా ఎలాంటి దోషం ఉండదని అనుగ్రహించింది పార్వతీ దేవి. వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి.? మన సంప్రదాయంలో ప్రతీ ఏటా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు. రెండోవి భాద్రపదంలో గణపతి నవరాత్రులు, మూడోవి ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు. అందులో వినాయక నవరాత్రులు అయితే ఊరువాడా వైభవంగా జరుగుతాయి. గణపతి ఆరాధన భక్తుల ఎమోషన్‌తో కూడుకున్న అంశం. విఘ్నేశ్వరుడంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి, మోక్ష ప్రాప్తి కలగాలన్నా, వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలని పురాణాలు చెబుతున్నాయి. నవరాత్రోత్సవాలకు ఉన్న విశిష్టత ఏంటి.? గణపతిని పూజిస్తే మూడు గ్రహాల అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞాన ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతాయి. కుజగ్రహం అనుగ్రహంతో వివాహం, అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. కేతుగ్రహం అనుగ్రహంతో మోక్షప్రాప్తి కలుగుతుంది. గణపతి ఆరాధనతో ఈ మూడు గ్రహాల అనుగ్రహం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. పార్వతీ తనయుడికి చేసే పూజలకు హిందూ పురాణాలు, సంప్రదాయంలో అంత ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి పూజ పొరపాట్లు లేకుండా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు పండితులు. పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెడుతారు. పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరిస్తారు. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లుపోసి, పైన కొబ్బరికాయ, రవిక ఉంచి కలశం ఏర్పాటు చేస్తారు. ఓ పళ్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెడుతారు. దీపారాధన తర్వాత వినాయక మంత్రాలను ఉచ్ఛరిస్తూ పూజను చేస్తారు భక్తులు. లంబోదరుడు గణనాయకుడు ఎలా అయ్యాడు.? ఇక తొమ్మిది రోజుల పాటు చేసే వినాయక నవరాత్రి ఉత్సవాలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. తొమ్మిది రోజుల పాటు రోజుకో పేరుతో వినాయకుడిని పూజిస్తారు. మొదటి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుడ్ని..వరసిద్ధి వినాయకుడు అంటారు. నవరాత్రుల్లో రెండో రోజు వికట వినాయకుడిగా..మూడో రోజు లంబోదర వినాయకుడిగా..నాలుగో రోజు గజానన వినాయకుడిగా పూజలు అందుకుంటారు. ఐదో రోజు మహోదర వినాయకుడిగా..ఆరో రోజు ఏకదంత వినాయకుడిగా..ఏడో రోజు వక్రతుండ వినాయకుడిగా..ఎనిమిదో రోజు విఘ్నరాజ వినాయకుడిగా పిలుస్తారు. ఇక తొమ్మిదో రోజు ధూమ్రవర్ణ వినాయకుడిగా పూజిస్తారు భక్తులు. వినాయకుడిని మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, 21 రోజుల్లో నిమజ్జనం చేస్తుంటారు. విఘ్నేశ్వరుడి పూజ కనీసం మూడు రోజుల పాటు చేయాలని పండితులు సూచిస్తున్నారు. మట్టి, నీళ్లతో విగ్రహాన్ని చేసి..తిరిగి నీళ్లలో నిమజ్జనం చేయడంలో ఎంతో అర్థం ఉందని చెబుతున్నారు. మనిషి కూడా మట్టిలో నుంచే వచ్చాడని..తిరిగి అదే మట్టిలో కలువక తప్పదన్న సూత్రం ఇందులో ఉంటుందని పండితులు చెబుతున్న మాట. విఘ్నేశ్వరుడికి మొత్తం 108 పేర్లు.. విఘ్నేశ్వరుడికి మొత్తం 108 పేర్లు ఉన్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. లంబోదరుడికి 32 రూపాలు ఉంటే అందులో 16 రూపాలు ముఖ్యమైనవనీ పండితులు చెబుతున్నారు. అయితే వినాయకుడికి విఘ్నాధిపతి అని కూడా పేరుంది. దీనిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే పూర్వం దేవతలు, మునులు..విఘ్నాలను తొలగించేందుకు ఓ అధిపతి కావాలని శివుడ్ని వేడుకున్నారట. పుణ్యనదులలో స్నానం చేసి వచ్చిన వారికే ఆ భాగ్యం కల్పిస్తానంటే.. అందరికంటే ముందు వినాయకుడు పుణ్యనదుల స్నానం పూర్తి చేసి వచ్చాడని..అలా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి.
Admin
Studio18 News