Studio18 News - భక్తి / : Tirumala Prasadam: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడే కాదు.. నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాజుల కాలంలోనే కాదు.. 1993లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తరువాతకూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్టగా క్రమ పద్దతిలో కొనసాగుతోంది. స్వామివారికి ప్రీతికరమైన లడ్డూ గురించి భక్తులకు సుపరిచితమే. అయితే, స్వామివారికి ఇంకొన్ని ప్రసాదాలను కూడా నివేదిస్తారు. శ్రీ వేంకటేశ్వరుడు తన చూపుతో ఆ పదార్థాలన్నింటిని పవిత్రం చేసి, ఆస్వాదించి, తన భక్త శేషాన్ని ప్రసాదాలుగా భక్తులకు ప్రసాదిస్తాడు. ఆ దివ్య ప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పుష్టి, తష్టీ, సంతుష్టీ కలుగుతాయి. దానితోపాటు ఎన్నో కోరికలు నెరవేరడంతోపాటు ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. స్వామివారికి ఎప్పుడు ఏ నైవేద్యం సమర్పిస్తారంటే.. → స్వామివారికి ప్రతీరోజూ త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ మూడు సమయాల్లో ఉంటుంది. → ఉదయం 5.30 గంటలకు, ఉదయం 10గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఉంటుంది. వీటినే మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం, మూడో గంట నైవేద్యంగా పిలుస్తారు. → ఉదయం 5.30నిమిషాలకు (మొదటి గంట నైవేద్యం) సమర్పించే నివేదనలో చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్ధ్యోజనం, మాత్ర ప్రసాదాలు, లడ్డూలు, వడలు నివేదిస్తారు. ఈ ప్రసాదాలనే బేడి ఆంజనేయస్వామితో పాటు ఇతర ఉపాలయాలకు పంపుతారు. → ఉదయం 10 గంటలకు (రెండో గంట నైవేద్యం) నివేదించే ప్రసాదాలలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సాకిరి బాత్ సమర్పిస్తారు. → రాత్రి 7.30 నిమిషాలకు (మూడో గంట నైవేద్యం) నివేదించే ప్రసాదాల్లో కదంబం, మొలహోర, వడలు, తోమాల దోశలు, లడ్డూలతో పాటు.. ఆదివారం రోజు ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా చెప్పే పిండిని శ్రీవారికి నివేదిస్తారు. → వారంలో ఒక్కరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. → సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. → మంగళవారం సమర్పించే నైవేద్యంలో ప్రత్యేకంగా ‘మాత్ర ప్రసాదం’ ఉంటుంది. మిగిలినవన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. → బుధవారం సమర్పించే ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పు సమర్పిస్తారు. → గురువారం సమర్పించే ప్రసాదాల్లో నిత్యం సమర్పించే వాటితోపాటూ తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబీ, మురుకు, పాయసాలు నివేదిస్తారు. → శుక్రవారం శ్రీవారి అభిషేక సేవ జరుగుతుంది. ఈ కారణంగా ఆ రోజు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు. → శనివారం నివేదనలో కదంబం, చక్రపొంగళి, లడ్డూలు, వదలు, పులిహోర, దద్యోజనం, మిర్యాల పొంగలి, సీర, సేకరాబాత్, కదంబం, మొలహోర, తోమాల దోశలు సమర్పిస్తారు. → ఏకదాశి, వైకుంఠ ఏకాదశి, ప్రత్యేక పర్వదినాల్లో దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను స్వామివారికి నివేదిస్తారు. → నెలరోజులపాటు జరిగే ధనుర్మాస వ్రతంలో బెల్లం దోశలను స్వామివారికి నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవాల్లో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి.
Admin
Studio18 News