Studio18 News - భక్తి / : Vinayaka Chavithi 2024 : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణాలు, పల్లెల్లో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. ప్రజలు తమ ఇళ్లలో గణపథులను ప్రతిష్టించుకొని నిష్టతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, గర్భిణీ మహిళలు గణపతి పూజ చేసుకోవచ్చా.. గణపతి పూజలో పాల్గొనవచ్చా.. అనే విషయంపై అనేకమందిలో సందేహాలు ఉన్నాయి. ఈ సందర్భంగా భక్తుల సందేహాలను పండితులు నందిభట్ల శ్రీహరి శర్మ ఓ మీడియా ఛానెల్ డిబేట్ లో నివృతి చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. బహిష్టి సమయంలో ఉన్నటువంటి స్త్రీలు గణపతి పూజలో పాల్గొనవద్దు. పండుగ రోజున ఏ వస్తువులను తాకకుండా ఇంట్లో ఓ చోట కూర్చొని.. ఇంట్లో ఉన్న పెద్దవారి చేత.. పూజా విధానాన్ని చేయించవచ్చు. వినాయక చవితి రోజున, పూజ సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బహిష్టి సమయంలో ఉన్న స్త్రీలు ఇంట్లో వస్తువులను తాకకూడదు. అదేవిధంగా ఏటి సూతకం (అంటు) లో ఉన్నవారు కూడా పూజలో పాల్గొనకూడదు. అయితే, ఇక్కడ ఓ విషయం ఉంది. బాబాయిలు, పెద్దనాన్నలు చనిపోయినప్పుడు.. ఆ సమయంలో వారి వంశస్తులందరికీ ఏటి సూతకం వర్తించదని నందిభట్ల శ్రీహరి శర్మ చెప్పారు. తండ్రి, తల్లి చనిపోయినట్లయితే వారి కుమారులు, కుమారుల కుటుంబ సభ్యులకు మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుంది. వారు సంవత్సరం పాటు పండుగలు, నోములు, వ్రతాల్లో పాల్గొవద్దని శ్రీహరి శర్మ తెలిపారు. కొన్ని శాస్త్ర ప్రమాణాలు అనుసరించి గర్భిణీ స్త్రీలకు ఐదో నెల లేదా ఏడో నెల తగిలిన తరువాత పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. వారి కుటుంబ సభ్యులు, పిల్లల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. పూజా కార్యక్రమాలను దగ్గరుండి చూడవచ్చు తప్పులేదు. పూజా కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనవద్దు. ఎందుకంటే.. కొన్ని మంత్రాలు ఉఛ్చరించాల్సి ఉంటుంది. ఆ మంత్రాల శబ్ధాల తరంగాలు గర్భంలోని శిశువుకు ఇబ్బందులు తెచ్చిపెడతాయన్న ఉద్దేశంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. శాస్త్రాల ప్రకారం కుటుంబంలో ఐదు లేదా ఏడు నెలలు దాటిన గర్భిణీ స్త్రీ ఉన్నట్లయితే.. ఆమె భర్త కొబ్బరికాయ కొట్టకూడదు.. గుమ్మడికాయ కూడా కోయకూడదు.. ఈ నియమాలు మన శాస్త్రంలో చెప్పబడిందని శ్రీహరి శర్మ తెలిపారు.
Admin
Studio18 News