Studio18 News - భక్తి / : Nag Panchami 2024 : తెలుగు రాష్ట్రాల్లో నాగ పంచమిని భక్తులు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. నాగ పంచమి సందర్భంగా పాముల పుట్టల వద్ద, శివాలయాల్లోనూ, సుబ్రహ్మణ్యస్వామి ఆయాలతో పాటు పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే భక్తులు స్నానాలు ఆచరించి నాగ పుట్టల వద్దవెళ్లి పూజలు నిర్వహించి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా తెల్లవారు జామునే భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. దీంతో ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సిద్ధిపేట జిల్లాలోని గాడిచర్లపల్లి సంతాన నాగదేవత ఆలయంకు తెల్లవారు జామునుంచే భక్తులు తరలివచ్చారు. పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నాగ పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా హస్నాబాద్ లో నాగ పంచమి సందర్భంగా భక్తులు పుట్టలో పాటుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రావణ మాస మొదటి శుక్రవారం కావడంతో నాగ పంచమి పురస్కరించుకొని చెన్నూర్ లోని అంబా అగస్తేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు.. ఆలయంలోని నాగ దేవత విగ్రహానికి పూజలు చేసి, పుట్టలో పాలుపోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ నాగదేవత ఆలయంలో నాగ పంచమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పుట్టల్లో పాలు పోసి భక్తులు మెక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతోపాటు నాగ పంచమి శుభ ముహూర్తం కావడంతో చిన్నారులకు అక్షర శ్రీకర చేయించి, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు వేచియున్నారు.
Admin
Studio18 News