Studio18 News - భక్తి / : Vemulawada : దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో నిర్వహించే పూజలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయ మహా మండపంలోని ఇత్తడి, వెండి తొడుగులను శుభ్రం చేశారు. ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. శ్రవణ మాసం మొదటి సోమవారం కావడంతో ఇవాళ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఇవాళ్టి నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో బ్రేక్ దర్శనం ప్రారంభించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో వీఐపీ భక్తుల తాకిడితో సాధారణ భక్తులకు ఇబ్బంది కాకుండా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. ఒకరికి రూ. 300 టికెట్ ధరతో ఉదయం 10:15 గంటల నుంచి 11:15 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. బ్రేక్ దర్శనం కార్యక్రమంను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. శ్రావణ మాసంలో ఆలయంలో రోజూ స్వామివారికి తెల్లవారు జామున 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మంగళ వాయిధ్యాలు, సుప్రభాతం, సర్వదర్శనం, ఆలయ శుద్ధి, ప్రాత:కాల పూజలు నిర్వహించనున్నారు. మొదటి సోమవారం కావడంతో మొక్కులు చెల్లించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.
Admin
Studio18 News