Studio18 News - ఆరోగ్యం / : కొందరు సరిగా ఆహారం తీసుకోకుండానో, తిన్నది సరిగా అరగకపోవడం వల్లనో సన్నగా, పీలగా ఉంటుంటారు. మరికొందరు సరిగా తిన్నా, తినకున్నా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇలాంటి రెండు రకాల వారు కూడా పలు రకాల పళ్లు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని రకాల పళ్లు బరువు తగ్గడానికి తోడ్పడితే, మరికొన్ని రకాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. బరువు పెరగడానికి కారణమయ్యే పళ్లు, వాటి నుంచి శరీరానికి అందే శక్తి ఎంతో చూద్దామా.. మామిడి పళ్లు వీటిలో సహజంగానే చక్కెర పదార్థాలు ఎక్కువ. ప్రతి 100 గ్రాముల మామిడి పండ్ల నుంచి శరీరానికి 60 కేలరీల శక్తి అందుతుంది. డైటింగ్ లో ఉన్నవారు వీటిని కాస్త తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటి పళ్లు ఈ పళ్లలో కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాలు ఎక్కువ. బాగా పండిన వాటిలో అయితే చక్కెరలు మరీ ఎక్కువగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల అరటి పళ్ల నుంచి 89 కేలరీల శక్తి అందుతుంది. సీతాఫలాలు ఈ పండ్లలో ప్రతి వంద గ్రాములకు 94 కేలరీల శక్తి వస్తుంది. చక్కెరల శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కానీ దీనిలో పోషకాలు కూడా చాలా ఎక్కువే. ద్రాక్ష పళ్లు తియ్యగా మంచి రుచితో ఉండే ద్రాక్ష పళ్ల నుంచి ప్రతి 100 గ్రాములకు 67 కేలరీల శక్తి వస్తుంది. మనకు తెలియకుండానే ఎక్కువగా తినేసే పళ్లలో ఇవి ఒకటి. సపోటా.. దీనిలో ప్రతి 100 గ్రాములకు 83 కేలరీల శక్తి వస్తుంది. బాగా పండిన వాటిలో అయితే చక్కెరల శాతం మరీ ఎక్కువ. అలాగే పోషకాలూ బాగానే ఉంటాయి. పనస గింజలు అద్భుతమైన పోషకాలకు నిలయమైన పనస గింజల్లోనూ కేలరీల ఎక్కువే. ప్రతి 100 గ్రాముల పనస నుంచి 95 కేలరీల శక్తి వస్తుంది. లిచీ పళ్లు.. ఈ రకమైన పళ్లలో ఫైబర్ వంటివి తక్కువ. చక్కెరల శాతం ఎక్కువ. ప్రతి 100 గ్రాముల లిచీల నుంచి 66 కేలరీల శక్తి అందుతుంది. ఖర్జూరాలు చక్కెరలు అత్యంత ఎక్కువగా ఉండే వాటిలో ఖర్జూరం కీలకమైనది. రుచిగా ఉండటం వల్ల తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటాం. ప్రతి వంద గ్రాముల ఖర్జూరాలలో ఏకంగా 282 కేలరీల శక్తి ఉంటుంది. దానిమ్మ పళ్లు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయమైన దానిమ్మ పళ్లలో ప్రతి 100 గ్రాములకు 83 కేలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా దానిమ్మ రసం తాగితే శరీరంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. అంజీర్ పళ్లు (ఫిగ్స్) ఈ పళ్లలో ప్రతి వంద గ్రాములకు 74 కేలరీల శక్తి ఉంటుంది. అదే ఎండు అంజీర్ అయితే.. ఇంతకు మూడింతల కేలరీలు ఉంటాయి. అయితే ఎండు అంజీర్ నుంచి ఎన్నో అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. అలాగని ఈ పళ్లకు దూరంగా ఉండొద్దు.. ఈ పది రకాల పళ్లు తింటే బరువు పెరుగుతామన్న భావనతో వాటికి దూరంగా ఉండవద్దని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. పళ్లు అంటేనే విటమిన్లు, కొన్నిరకాల ప్రొటీన్లు, ఖనిజాలకు నిలయమని చెబుతున్నారు. అందువల్ల అన్ని రకాల పళ్లను కొంత మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.
Also Read : #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు
Admin
Studio18 News