Studio18 News - ఆరోగ్యం / : ప్రపంచాన్ని వణికించిన.. లక్షలాది మంది మరణానికి కారణమైన కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్(HMPV) వ్యాప్తితో చైనాలోని ప్రజలు ఆస్పత్రుల బాటపడుతున్నారని.. ప్రధాన నగరాల్లో వైరస్ భారినపడిన వారితో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. కొత్త వైరస్ ప్రభలుతున్న కారణంగా చైనా ప్రభుత్వంసైతం మాస్క్ లను ధరించడం తప్పనిసరి చేసిందన్న వార్తలు భారత్ ప్రజలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
Also Read : 'డాకు మహారాజ్' టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
2024 ఏప్రిల్ నుంచే చైనాలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. అయితే, చైనా ప్రభుత్వం మాత్రం ఈ వైరస్ ను మహమ్మారిగా గుర్తించలేదని, ప్రస్తుతం శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. ఈ వైరస్ భారిన పడి పలువురు మృత్యువాతసైతం పడ్డారని.. ముఖ్యగా పిల్లలు, వృద్ధులే ఎక్కువగా ఈ వైరస్ భారిన పడుతున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ వార్తలపై చైనీస్ మంత్రిత్వ శాఖ ఖండించింది. హెచ్ఎంపీవీ అనే కొత్త వైరస్ కారణంగా దేశంలోని ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. చైనాను సందర్శించడం గురించి విదేశీయులు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. శీతాకాలంలో సాధారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధులను నియంత్రించడానికి చైనా జాతీయ వ్యాధి నియంత్రణ – నివారణ మార్గదర్శకాలు జారీ చేయబడిందని మావో నింగ్ పేర్కొన్నారు.
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ.. హెచ్ఎంపీవీ అనేది సాధారణ శ్వాసకోశ వైరస్. జలుబు వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల్లో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, ఇది తీవ్రమైన లేదా ఆందోళన కలిగించే విషయం కాదని తెలిపారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి సాధారణమని చెప్పారు. అయితే, చైనాలో గత కొన్నివారాలుగా శ్వాసకోశ సంబంధ అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ భారత్ లో మాత్రం ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి, ఆ దేశంలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్ ప్రభుత్వం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు కీలక విజ్ఞప్తి చేసింది. చైనాలోని పరిస్థితులపై సమాచారమివ్వాలని డబ్ల్యూహెచ్ఓను కేంద్రం కోరింది. శనివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని సంయుక్త పర్యవేక్షణ బృందం దేశంలోని పరిస్థితులను సమీక్షించింది. ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనాలోని కొత్త వైరస్ కేసులపై ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరంలేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో అసాధారణ పరిస్థితులు లేవన్న కేంద్రం.. సమస్య పెరగడానికి ఇన్ ప్లూయెంజా వైరస్, ఆర్ఎస్వీ, హెచ్ఎంపీఏ కారణమని తెలిపింది. అవన్నీ సీజన్ లో కనిపించే సాధారణ వ్యాధికారకాలేనన్న కేంద్రం.. ప్రస్తుత పరిస్థితులను అన్ని మార్గాల్లో నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.
Admin
Studio18 News