Studio18 News - ఆరోగ్యం / : సాధారణంగా చక్కెర ఎక్కువగా తీసుకునేవారికి, తీపి పదార్థాలు విపరీతంగా తినేవారికి భవిష్యత్తులో డయాబెటిస్ (షుగర్) వ్యాధి వస్తుందని అంటుంటారు. ఇందులో కొంత వరకే వాస్తవం, మరికొంత అనవసరపు ఊహలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి చక్కెర అతిగా తీసుకోవడం సరికాదని... అయితే కేవలం చక్కెర వల్ల మాత్రమే డయాబెటిస్ వస్తుందనేది అపోహ అని స్పష్టం చేస్తున్నారు. చక్కెర ప్రభావం శరీరంపై ఎలా ఉంటుందనే దానిపై ఐదు అంశాలు కీలకమని వివరిస్తున్నారు. ఆ ఐదు అంశాలేమిటో తెలుసుకుందాం... అధిక బరువు, ఊబకాయంతో... అధికంగా చక్కెర ఉన్న పదార్థాలను విపరీతంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారు. ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుంది. ఇది ఆటోమేటిగ్గా టైప్–2 డయాబెటిస్ కు దారి తీస్తుంది. ఇన్సూలిన్ నిరోధకత పెరిగిపోయి... ఎక్కువకాలం... పరిమితికి మించి తీపి పదార్థాలు తింటూ ఉండటం వల్ల శరీరంలో ఇన్సూలిన్ నిరోధకత పెరిగి డయాబెటిస్ కు దారి తీస్తుందని... అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు తమ పరిశోధనల్లో గుర్తించాయి. రక్తంలో విపరీతంగా గ్లూకోజ్ స్థాయులు తీపి పదార్థాలు తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా పెరుగుతాయి. వాటిని నియంత్రించేందుకు శరీరం ఇన్సూలిన్ ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటుంది. తిరిగి తిపి పదార్థాలు తింటే... అలా గ్లూకోజ్ స్థాయులు అధికంగానే కొనసాగుతూ... చివరికి డయాబెటిస్ వైపు దారి తీస్తాయి. తీపిగా లేకున్నా... షుగర్ పెంచేలా... బ్రెడ్, సాస్ లు, వాటిని కలిపి తయారు చేసే ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో చక్కెర ఎక్కువగా కలుపుతారు. అవి పైకి బాగా తియ్యగా ఉన్నట్టు అనిపించకపోయినా.. వాటిలోని షుగర్ మాత్రం శరీరంపై ప్రభావం చూపిస్తుంది. గ్లూకోజ్ స్థాయులను పెంచేస్తుంది. సమతుల ఆహారం తీసుకోవడమే మంచి ఆప్షన్ డయాబెటిస్ బారిన పడవద్దన్నా... ఇప్పటికే డయాబెటిస్ బారిన పడినవారికైనా... సమతుల ఆహారం తీసుకోవడమే మంచి మార్గమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు, ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వు పదార్థాలు (అన్ శాచురేటెడ్ ఫ్యాట్) ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు వేగంగా పెరగకుండా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
Also Read : నెలకు రూపాయి వేతనం.. అయినా ఐఏఎస్‌లలో అత్యంత ధనవంతుడీ అధికారి!
Admin
Studio18 News