
నాయకులలో ఎంత స్వార్ధము,అవినీతి ఉందో అంతకు రెట్టింపు సామాన్యప్రజలలో కూడా ఉండటం గమనిస్తే భారత దేశ సంస్కృతి ఎంతగా దిగజారిపోయిందో అర్ధం అవుతుంది. ఒకర్నొకరు పోల్చి చూసుకొంటూ,అసూయతో అట్టుడికిపోతూ ,తానేమైపోయినా ఫర్వాలేదు,పొరుగువారు పచ్చగా ఉండకూడదనే తామస ప్రవ్రుత్తి భారతీయ సమాజంలో రోజు రోజుకూ మహమ్మారిలా పెరిగిపోతుంది.
మొక్కులు, ముడుపులు,బలులు, జపతపాలు ,యజ్ఞయాగాలు సమస్తం తీవ్రమైన కాంక్షలతో,స్వార్ధభూయిష్టమైన మనస్సుతో చేస్తున్నారు. అక్రమ సంపాదనలో కొద్ది వాటాను టన్నులకొద్దీ బంగారం రూపంలో గుళ్ల కు సమర్పించుకొంటున్నారు. ఇలా సాక్షాత్ దేవుడితోనే వ్యాపారం చేస్తూ పైపెచ్చు అది భక్తి అని నిస్సిగ్గుగా చాటుకొంటున్నారు . గుళ్లకు ఇచ్చే దాంట్లొకనీసం పాతికో వంతైనా సమాజసేవకు వినియోగిస్తే సంఘం ఎంత ప్రశాంతంగా ఉంటుంది?
గత 1500 ఏళ్ళనుండి భారతీయ చరిత్రను,సమాజ పోకడలను పరిశీలిస్తే, భారతీయులలో పెరిగిపోయిన స్వార్ధం,అవినీతి,అధర్మం, దేశద్రోహపు బుద్ధులు ఎంతగా పేట్రేగి పోయాయో,తద్వారా దేశం పరాయిమూకలచేతిలో ఎలా ముక్కచెక్కలయిందో తెలుస్తుంది .
నాలుగు రూకలిస్తే చాలు మన దేశపు ఆనుపానులు చేరవేసే దేశద్రోహులు ఎంతమందో?
నాలుగు దెబ్బలువేస్తే చాలు రాజ్యపు రహస్యాలు వెళ్లగ్రక్కిన వారెందరో?
నాలుగురకాల ఆకర్షణలు ఎరవేస్తే చాలు,సొంతింటి కే కన్నమువేసిన వారెందరో?
తనకు లేనిది,తనకు దక్కనిది పక్కవాడికి ఎందుకుండాలనే రక్కసులు ఎందరో?
తమ బలహీనతలకు దేశభవిష్యత్ ను తాకట్టు పెట్టిన వారెందరో?
కర్మ సిద్ధాంతాన్ని అపార్ధం చేసుకొని పలాయన వాదాన్ని నెత్తినపెట్టుకొని సోమరిపోతులుగా మారి శుంఠ ల్లా దిగజారినవారెందరో?
పచ్చి స్వార్ధం తో మూఢనమ్మకాలతో బలులు ఇస్తూ బతుకులు బండపాలు చేసిన వారెందరో ?
తేరగా సంపదరావాలి , అప్పనంగా సుఖాలు పొందాలనుకునే పరాన్న జీవులెందరో?
కంచాలు కంచాలుగా లంచాలను మెక్కుతూ బితుకు బితుకుమంటూ అవినీతి సామ్రాజ్యాన్ని ఏలే వారెందరో?
కన్నవారిపై ప్రేమలేదు, దేశమంటే భక్తిలేదు ,సంస్కృతి పై పూజ్యతలేదు, సంప్రదాయాలపై గౌరవం లేదు , సాటిమనిషిపై అభిమానం లేదు, ఉన్నదల్లా కేవలం కరడుగట్టిన స్వార్ధం,ధన పిపాస, కీర్తి కండూతి,భోగలాలస ! భారతీయులు భారతీయులేనా? లేక వీరికి పరాయి పిశాచ మూకల క్రౌర్యం అంటువ్యాధిలా అంటుకొందా ?
భారతీయులు ముఖ్యం గా ఆంధ్రులు ఇలా ఎందుకు దిగజారిపోయారు? భారతీయులు ఎందుకు ఇంత దారుణంగా అవినీతిలోమునిగిపోయారు ? వారి ప్రవర్తనలో ఇంత ఘోరమైన లోపం ఎలా వచ్చింది ? భారతీయులు ఇంత క్రూరమైన స్వార్థపరులుగా ఎలా మారిపోయారు?. భారత దేశ సంస్కృతిలో అవినీతి ఎందుకు ఇంతలా పెరిగిపోయింది. పైపెచ్చు, భారతీయులు అవినీతినిఎందుకని నీతి బాహ్యంగా చూడటం లేదు?
ఏ మనిషీ పుట్టుకతో అవినీతితో పుట్టడు . ఏ జాతి కూడా పుట్టుకతో అవినీతిమయంగా ఉండదు.కానీ పుట్టుకతోనే గుణ వాసనల తో పుడతాడు మనిషి. పరిస్థితులప్రభావంతో ఆయా గుణాలు వృద్ధిచెందడమో,మరుగునపడిపోవడమో జరుగుతుంది.
ఈ అవినీతి జాడ్యం,స్వార్థపరత్వం ఆంధ్రాకో, కేరళకో మాత్రమే కాదు,దేశం అంతటా వ్యాపించి ఉంది.
భారతీయులు అవినీతి పరులను భరించడమే కాదు,వారిని హీరోలుగా ఆరాధిస్తూ అందలం ఎక్కిస్తున్నారు.
భారతీయులు చివరికి ఎంతగా దిగజారిపోయారంటే, దేవునితోనే లాలూచీ బేరాలాడటం చేస్తూ సనాతన ఆచార వ్యవహారాలను భ్రష్ట్టు పట్టించేస్తున్నారు.
నేడు, మన భారతదేశంలో భక్తికూడా ఒక వ్యాపార ప్రక్రియగా దిగజార్చేశారు. కనీస అవసరాలేకాదు,విలాసాలు,అంతేకాదు పక్కవాడికేమి సుఖాలున్నాయో అవన్నీ కావాలనుకొంటు కోర్కెలు క్షణ క్షణానికి పెంచేసుకొంటూ దైవారాధనను కూడా వ్యాపార విలాస క్రీడగా మార్చేశారు.
మన భారతీయులు దేవుడికి డబ్బులు అర్పిస్తారు. దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశిస్తారు దీని అర్థం ఏమిటంటే అర్హత, అవసరం లేకున్నా లబ్ది పొందాలనుకోవడమే.
గుడి వెలుపల ఇటువంటి వ్యాపార ప్రక్రియను *లంచం* అంటాము.
బాగా ధనవంతుడైన భారతీయుడు గుళ్లకు డబ్బు ఇవ్వడు. బంగారు కిరీటాలు ఇతర ఆభరణాలు కానుకగా ఇస్తాడు.
అతని కానుకలు పేదవాడి ఆకలి తీర్చవు. అతడు ఇచ్చేది దేవుడికి.
ఆకలిగొన్న వాడికి సహాయం చేయడం వృధా అనుకుంటాడు. అందుకే దేవునికి కానుకలు ఇస్తాడు. ఈ విధంగా విపరీతమైన సంపద భారతదేశంలోని గుళ్ళల్లో పోగుపడుతుంది . ఈ సంపద ఏం చేయాలో వారికి అర్థం కాదు. కోశాగారాలలో బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బు దుమ్ము కొట్టుకుపోతున్నాయి.
యూరోపియన్స్ భారతదేశానికి వచ్చి పాఠశాలలు నెలకొల్పారు. భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.
తన కోర్కెలను తీర్చడానికి దేవుడు కానుకలు తీసుకోవడం ఎట్లా తప్పుకాదో, బయట లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన నెలకొంది. అందుకే భారతీయులు తేలికగా అవినీతికి లొంగిపోతారు.
ఈ దేశ సంస్కృతి, అవినీతిని తనలో ఇముడ్చుకుంటుంది.
1.అవినీతిని భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే బాగా అవినీతిపరులైన రాజకీయ నాయకులను అధికారంలోకి తెస్తారు. ఇది పశ్చిమ దేశాలలో మనం ఊహించలేము.
2.చరిత్ర చూసినా కూడా అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో లంచాలుకు లొంగి ద్వారాలు తెరవడం ద్వారా అనేక పట్టణాలు, రాజ్యాలను వశపరచుకున్న సంఘటనలు అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు అనేకం.
ఇది భారతదేశం అంతటా ఉన్న సారూప్యత.
పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల పోరాట పటిమ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.
నాదేశంను అంతమొందించేందుకు టర్క్ లు పోరాడారు.
కానీ భారత దేశంలో పోరాటం అవసరం లేదు లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం లేకుండా చేయవచ్చు.
దండెత్తే వాడు డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
ఆ రాజుల దగ్గర పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ ఇది సాధ్యం. ప్లాసి యుద్ధం లో భారతీయులు గట్టిగ యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది మీర్ జాఫర్ కు Clive లంచం ఇచ్చాడు. అంతే, బెంగాల్ లొంగి పోయింది.
భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో డబ్బు మారక పాత్ర ఉంది. డబ్బు ముట్టి నందున గోల్కొండ వెనుక దర్వాజ తెరచి ఉంచడం వలన 1867లో ఈ కోటను ఆక్రమించు కోగలిగారు.
మరాఠాలను, రాజపుత్రుల ను లంచాల ద్వారానే మొగలులు గెలుచుకోగలిగారు.శ్రీనగర్ రాజు ఔరంగజేబు దగ్గర డబ్బులు తీసుకుని సులేమాన్ ను అప్పగించాడు. భారతీయులు అవినీతికి తలొగ్గి చేసిన దేశద్రోహ కార్యక్రమాలు అనేకం ఉన్నాయి.నేడు డబ్బుతీసుకొని తమతలరాతలను మార్చే నాయకులను ఎన్నుకొంటున్నారు. తన చేతిలో పైసా పడితే చాలు,ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కేయడానికి జనాలు సిద్ధం.
నేడు మన తెలుగురాష్ట్రాలలో కూడా అవినీతి మచ్చలున్న నాయకులనే అధికారం లో కూర్చో పెట్టారంటే ఆంధ్రులు ఎంత అవినీతి ప్రియులో అర్ధం అవుతుంది.అవినీతికి భాషాబేధమేమీలేదు. ద్రావిడులు మొదలుకొని ఆర్యపుత్ర సంతానం సమస్తం అవినీతితో పుచ్చిపోయింది.
అర్థం కాని విషయమేమిటంటే, భారతీయులకు ఇచ్చిపుచ్చుకునే ( క్విడ్ -ప్రో కో / లంచాలు)సంస్కృతి ఎందుకు వచ్చింది ఇతర నాగరిక దేశాలలో ఇది ఎందుకు లేదు?
నైతికంగా అవినీతి రహితంగా మసలుకుంటే ‘అందరము బాగుపడతాము’ అనే స్వభావం భారతీయులలో కొరవడడానికి మూల కారణం, వారు గత 1500 ఏళ్లలో ఎదుర్కొన్న విదేశీ దాడులే నని అర్ధం అవుతుంది.
కనీస అవసరాలేకాదు,తమ మానప్రాణాలకు ముప్పు ఉప్పెనలా విరుచుకు పడుతుంటే ఏది నీతి ? ఏది అవినీతి? అనే విచక్షణ ప్రాణికి ఎక్కడ ఉంటుంది ? భారతీయులు కేవలం ప్రాణులుగానే బతుకుతున్నారుతప్ప మనుషుల్లా బతకడం మర్చిపోయారు. భద్రతలేమి కి తోడు జ్ఞానసంపద లుప్తమై అజ్ఞానాంధ కారం లో చిక్కి సదాచారాలను మూడాచారాలుగా, సక్రమమైన వర్ణవ్యవస్థను అక్రమమైన కులవ్యవస్థగా దిగజార్చేసుకొన్నారు.
సమాజముపైన, తోటిమనిషిపైన అనుమానం,అసూయలేతప్ప అభిమానానికి చోటులేని పరిస్థితులలో దేశభక్తి,సమాజసేవ లాంటి వాటికి చోటెక్కడ ఉంటుంది? తమ వాకిట్లో వ్యర్ధాలను రోడ్ పై పడవేసే మనస్తత్వాన్ని చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు,మిగతావాళ్ళు ఏమైపోతే నాకేమిటి,నేను బాగుంటే చాలు”అనే దుష్ట దృక్పధం ఎంతగా వేళ్ళూనుకొందో అర్ధం అవుతుంది. శుచీ శుభ్రత మరచిపోయారు. కనీసం గుళ్లను కూడా శుభ్రంగా ఉంచుకోలేని స్థితిలో మిగిలిపోయారు.
చాలామంది హిందువులు తమ భద్రతకోసం సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు.
మరికొంతమంది క్రిస్టియన్లు, ముస్లింలు గా మారారు. తద్వారా భారతీయ సమాజం మతాల పేరిట, కులాల పేరిట చీలికలైపోయింది. దానివలన భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం లేకుండాపోయింది.
నేటి భారతదేశం లో భారతీయులు లేరు. భిన్న విశ్వాసాలతో, కరడుగట్టిన స్వార్ధం,అపనమ్మకం,అవినీతి,అధర్మం తోకుళ్లిపోయిన హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు మొదలగువారు బతుకులీడుస్తున్నారు.
1400 సంవత్సరాల క్రితం భారతీయులంతా ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు. కులాలుగా మతాలుగా విడిపోవడం తో అనారోగ్య సంస్కృతి దాపురించింది. అసమానతలు అనేవి అవినీతి సమాజానికి దారితీస్తాయి. భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు,ఒక్క దేవుడిని తప్ప. దేవునికే లంచం ఇచ్ఛే వాళ్ళు తమకు కాస్తలాభం కలుగచేసే మనుషులకు ఎందుకివ్వరు?
భారతీయులు మారాలి. నిజమైన భారతీయులై ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఇది సాధ్యమేనా?
-బాలు
Follow us on Social Media