Studio18 News - అంతర్జాతీయం / : Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. తన ‘ఎక్స్’ ఖాతాలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని అన్నారు. నవంబర్ లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా కమలాహారిస్ పేరు వినిపించింది. కమలాహారిస్ కు పోటీగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా పేరు తెరపైకి వచ్చింది. అయితే, శుక్రవారం ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఒబామా, ఆయన సతీమణి సమర్ధించారు. కమలహారిస్ కు ఫోన్ చేసి తమ మద్దతును తెలియజేశారు. మా స్నేహితురాలు కమలాహారిస్ కు నేను, మిషెల్ కొద్దిరోజుల క్రితం ఫోన్ చేశాం. ఆమె అమెరికాకు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం. మా పూర్తి మద్దతును ఆమెకు తెలియజేశామని చెప్పారు. దీనికితోడు పార్టీలో కీలక నేతలంతా కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడంతో అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. ఇప్పటికే అమెరికాలో ప్రచారం హోరెత్తుతోంది. అమెరికా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ పేరు ప్రముఖంగా ఉండటంతో.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెను టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. దీంతో కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే ట్రంప్ వర్సెస్ హారిస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు కావటంతో ట్రంప్, హారిస్ ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.
Admin
Studio18 News