
- నేటి నుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర
- నృసింహుడిని దర్శించుకోనున్న కిషన్ రెడ్డి, సంజయ్
- స్వామికి ప్రత్యేక పూజలు.. అనంతరం బహిరంగ సభ
- ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
- 5 జిల్లాలు.. 12 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర
- 24 రోజుల్లో 328 కి.మీ. మేర కొనసాగేలా ప్రణాళిక
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి రెండు విడతల యాత్ర విజయవంతం కావడంతో.. ఈసారి కూడా అదే ఊపును కొనసాగించేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. చారిత్రక, తెలంగాణ సాయుధపోరాట, ఉద్యమ నేపథ్య ప్రాంతాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళికలు రచించారు. యాదాద్రిలో నృసింహుడికి ప్రత్యేకపూజలు, బహిరంగ సభ అనంతరం మొదలయ్యే బండి సంజయ్ పాద యాత్ర.. 24 రోజులపాటు 5 జిల్లాలు, 12 నియోజకవర్గాల మీదుగా 328 కిలోమీటర్ల మేర సాగనుంది. యాదాద్రిలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొననున్నారు. తొలుత.. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి బయల్దేరి యాదాద్రికి వెళ్తారు.
10 గంటలకు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు.. యాదగిరిగుట్ట పట్టణ శివారులోని యాద్గార్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని 25 మండలాల మీదుగా 328 కిలోమీటర్ల మేర కొనసాగే ఆయన మూడోవిడత పాదయాత్ర వరంగల్‌లోని భద్రకాళి ఆలయ సందర్శనతో ముగుస్తుంది. చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి, రజాకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పోరాటం సాగించిన కిలాషపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేటతోపాటు ఐనవోలు, మల్లన్న అలయాల మీదుగా యాత్ర కొనసాగనుంది. రెండు రోజులకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున యాత్ర ఉంటుంది. కాగా.. మంగళవారం బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఘనంగా ఉండేలా మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎ్‌సఎ్‌స ప్రభాకర్, భిక్షమయ్యగౌడ్, యాదాద్రిభువనగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ. శ్యాంసుందర్, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. యాదగిరిగుట్టలో పార్టీ ప్లెక్సీలు, స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కేంద్ర నాయకత్వం కూడా ఈ పాదయాత్రకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని పార్టీ వర్గాల సమాచారం.
సంజయ్‌తోపాటు.. రాష్ట్ర పార్టీ ఎంపీలకు పార్లమెంటు సమావేశాల హాజరు నుంచి మినహాయింపునివ్వడమే ఇందుకు నిదర్శనమని ఆ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ యాత్రలో బహిరంగ సభలు కాకుండా రచ్చబండ సభలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ నాయకత్వం నిర్దేశించినట్టు వివరించాయి. పలుచోట్ల.. బీజేపీలోకి ఇతర పార్టీల నాయకుల చేరికలు కూడా ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
వీఆర్వోలను సర్దుబాటు చేస్తూ జారీ చేసిన జీవో నంబరు 121ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వీఆర్వోలను 22 నెలలపాటు రోడ్డుపాలు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు లాటరీ ద్వారా ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలనుకోవడం వారందరినీ అవమానించడమేనని మండిపడ్డారు. ‘‘ఈ మేరకు ఏకంగా జీవో జారీ చేయడం సిగ్గు చేటు. కేసీఆర్ మొదటి నుండి రెవెన్యూ వ్యవస్థపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు. వీఆర్వోలను దొంగలుగా చిత్రీకరించారు. అశాస్త్రీయమైన ధరణి వెబ్ సైట్‌లోని తప్పులను ఎత్తిచూపుతారనే ఉద్దేశంతో వీఆర్వో వ్యవస్థను తొలగించారు. ఉన్నత విద్యావంతులైన వీఆర్వోలను తహశీల్దార్లుగా చేస్తానని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్… అవినీతి అనే సాకుతో ఏకంగా వీఆర్వో వ్యవస్థనే నిర్మూలించడం దారుణం’’ అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
కాగా.. సీఎం కేసీఆర్ ఏడాది క్రితం ప్రకటించిన చేనేత బీమాను తక్షణం అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని సంజయ్ చేసిన హెచ్చరికతోనే ఈ పథకాన్ని ఆగస్టు 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప అన్నారు. ఇక.. మూడో విడత పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ మీద రాసిన ‘సలసల మరిగే నెత్తురు..’ పాటల సీడీని పార్టీ నేతలు ఆవిష్కరించారు.
మొదటిరోజు పాదయాత్ర ఇలా
పాదయాత్రలో భాగంగా సంజయ్ మొదటిరోజు 10.5 కిలోమీటర్లు నడవనున్నారు. యాదగిరిపల్లి మీదుగా గాంధీవిగ్రహం వద్దకు ఆయన చేరుకుంటారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పాతగుట్ట రోడ్డు, గొల్లగుడిసెలు, గొల్లగూడెం, ధాతరుపల్లి గ్రామాల్లో పర్యటిస్తారు. భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామ శివారులో రాత్రి బస చేస్తారు.
Follow us on Social Media