మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని వాగేశ్వర కళాశాలలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వెరవెల్లి రఘునాథ్‌రావు శిబిరానికి అతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆయన పేర్కొన్నారు.
దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసినట్లు నాయకులు తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే దండేపల్లి మండలంలో కంటి వైద్య శిబిరాలు, మంచిర్యాలలో 5కే, 10కే రన్ నిర్వహించినట్లు పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

